ఒక వ్యక్తికైనా, ఒక సమూహానికైనా మన మనసులో ఉన్న భావాలను చేరవేయు మాధ్యమం "భాష". ప్రపంచంలో కొన్ని లక్షల భాషలున్నాయి. కానీ ఎన్ని భాషలున్నా ఒక భావాన్ని మన మాతృభాషలో వ్యక్తపరిచినంత సుస్పష్టంగా, సుమధురంగా మరే భాషలోనూ వ్యక్తపరచలేము.
పసితనంలో అల్లరి చేసి అలసిపోయి, జన్మనిచ్చిన తల్లి ఒడిలో సేద తీరుతున్న సమయంలో, ఆ అమ్మ పాడే లాలి పాటను ఆదమరిచి ఆలకించటంతో మొదలవుతుంది మన "మాతృభాషాభ్యాసం".
మమతను పంచే ఆ పాట మధురం,
అయితే ఆ పాటకు అంతటి ఘనతను తెచ్చిన మాతృభాష ఆపాతమధురం!
కానీ, ఈ రోజుల్లో పురోగతి పేరుతో, పరదేశ భాషను ఆశ్రయిస్తున్నారు. పరభాషను ఆశ్రయిస్తే పర్లేదు, మాతృభాషను విస్మరిస్తున్నారు. తల్లిని మరువటం ఎంత తప్పో, మాతృభాషను మరువటమూ అంతే తప్పు.
మన తెలుగు ఎందరో కవుల కలాల్ని కదిలించిన స్ఫూర్తి, మన తెలుగు ఎందరో మేధావులకు జ్ఞానాన్ని అందించిన మరో సరస్వతి, మన తెలుగు ఎందరో విజేతలకు గెలుపు ఛాయలను చూపించిన సుదీప్తి, మన తెలుగు అంతులేని చరితకు చెరగని అరుదైన ప్రతీతి!
అలాంటిది ఈ రోజుల్లో బ్రతకడానికి పరదేశ భాష వెంట పరుగెడుతున్నారు, అసలు నడక నేర్పిన తెలుగుని మర్చిపోతున్నారు.
"బ్రతుకు తెరువు కోసం పరభాషను నాలుక మీద పెట్టుకో కానీ, బ్రతకడం నేర్పిన మాతృభాషను మాత్రం గుండెల్లో పెట్టుకో!"
Comments