top of page
Writer's pictureHemanth Karicharla

నేను సైతం!

అధికారులకి, మిత్రులకి, నా తోటి భారతీయులందరికీ ఆవేదనతో వ్రాయునది...!


కరోనా, బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్... ఇవి ప్రస్తుతం మన ముందున్న పెను సవాళ్లు. మనకో, మన కుటుంబానికో సమస్య వచ్చినా, కష్టం వచ్చినా బలంగా నిలబడతాం కదా, పోరాడతాం కదా? ఆరు నూరైనా, మరేదైనా సమస్యను పరిష్కరించుకుంటాం కదా?


అలాంటిది ఇప్పుడు మన దేశం మొత్తానికి ఒకే సమస్య వచ్చింది. అందరినీ పట్టి పీడిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు.. దేశమంటే ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం. కుటుంబంలో గొడవలు, మనస్పర్థలు ఉండటం సర్వ సాధారణం. అలాగే, మన కుటుంబంలో కూడా గొడవలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఓ విపత్తు వచ్చి, మన ముందు నిలబడి మన ఐకమత్యాన్ని, మన సమర్థతని ప్రశ్నిస్తుంది. మనం నీరుగారిపోతుంటే చూసి వెక్కిరిస్తుంది.


అలా జరగకూడదు. మనలో ఎన్నున్నా.. ఏదైనా కష్టం వస్తే ఒకరి కోసం ఒకరు నిలబడటం మనకేమి కొత్త కాదు, అది మన నెత్తురులో ఉంది. ఈ భరత గడ్డ మీద పుట్టిన ప్రతిఒక్కరి డి.ఎన్.ఏ. లో ఆ లక్షణం పుష్కలంగా ఉంటుంది. కానీ, మనలో చాలా మంది.. చాలా అంటే చాలా మంది.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మానవత్వం మర్చిపోయి, దిగజారి బతుకుతున్నారు, ప్రవర్తిస్తున్నారు, తోటివారిని పీడిస్తున్నారు.


ఇలా ఎవరు చేస్తున్నారనేది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. చెవులు రిక్కించి వినండి మీ అంతరాత్మ మీతో ఏం చెబుతుందో! ఓ సామాన్యుడు, అంటే ఓ మధ్యతరగతి, లేదా ఓ దిగువ మధ్యతరగతి వాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒంట్లో కాస్త ప్రాణం బాలేదని ఏదైనా ఓ హాస్పిటల్ గేటు తాకాలన్నా వణికిపోతున్నాడు. ఎందుకంటే, ఉద్యోగాలు లేక, ఒకవేళ ఉన్నా జీతాల్లో కోత వల్ల వచ్చే సగం జీతంతో ఇంటిల్లిపాదినీ పోషించడం కోసం రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బు మీ దగ్గరికి ఒక్కసారి వస్తే ఖాళీ అయిపోతుంది.


అలా ఉన్నదంతా ఊడ్చి మీకిచ్చి బతికితే మాత్రం.. ఆ తరువాత ఉత్త చేతులతో కుటుంబాన్ని ఎలా నడిపించగలడు. దానికన్నా చావడమే మేలేమో అనుకునే పరిస్థితి ఏర్పడింది! మరి దీనికి కారకులెవరు? ఎవరికి మా గొంతు వినిపించాలి? ఎవరికి చెబితే అర్థం అవుతుంది? ప్రతీ ఒక్కరి కంచంలో పంచభక్ష పరమాన్నాలు ఉండవు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా... ఇప్పటికీ గుప్పెడు మెతుకులు కోసం అలమటించే బతుకులెన్నో...!


ఎందుకంటే.. ఉన్నప్పుడు నోట్లు జల్లుతారు. ఖజానా ఖాళీ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకేం ఉంటుంది, అందుకే నోట్లో మట్టి జల్లుతున్నారు! ఈ పిచ్చి జనం కూడా అకౌంట్లలో డబ్బులు పడ్డాయని చూస్తున్నారు కానీ, అవి ఎంత కాలం నిలుస్తాయి, మన బతుకులు మనమే చక్క దిద్దుకునే మార్గం చూపించే నాయకుడు కదా మనకి కావాల్సింది అని ఎప్పటికీ అర్థం చేసుకోరు! ఇప్పుడు నిన్ను ఏ పథకం కాపాడింది?


చూస్తుండగానే అయినవాళ్లందరినీ కోల్పోతున్నావ్... ఇప్పుడు ఏ పథకం కింద నీ జేబులో డబ్బులు పెడితే నీ బాధ తీరుతుంది? బాధలో నుండే ఆలోచన పుడుతుంది, ఆలోచించు. ఇప్పుడైనా ఒకరి కోసం చూడటం మానుకో. ఎవరూ ఏదీ చేయరు! నీకు నువ్వే చేసుకోవాలి.

సరే, మిగతా విషయాలు తరువాత మాట్లాడుకుందాం... ఇప్పుడు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి అది చూద్దాం.


ముందుగా ఈ భయం అనేది అసలు వద్దు. భయపడే విషయాలు వేరే ఉంటాయి.. మనం చేసే తప్పులు, మన నిర్లక్ష్యం ఇలా.. కానీ, ఇది భయపడాల్సిన సమయం కాదు. ధైర్యంగా ఎదురెళ్లి పోరాడాల్సిన సమయం. చాలా మంది, ఇప్పుడున్న పరిస్థితిని అవకాశంగా తీసుకుని, నలుగురూ నాలుగు రకాలుగా చెబుతున్నారు, మనల్ని మభ్యపెడుతున్నారు. అందుకే, ఏది వినాలో, ఏది నమ్మాలో, దేన్ని అనుసరించాలి, దేన్ని ఆచరించాలో తెలీక తికమకపడుతూ అల్లాడిపోతున్నాం.


అందుకే, సర్రిగ్గా ఇలాంటప్పుడే.. మనం జాగ్రత్తగా ఆలోచించాలి. 'వినదగు నెవ్వరు చెప్పినా..' అన్నట్టు ఎవరేమి చెప్పినా గుడ్డిగా నమ్మేయకుండా అందులోని విషయాన్నీ, ఆ విషయం వెనుకున్న వాస్తవాల్ని, చెబుతున్న వ్యక్తి ఎవరు? ఇలా చెప్పడంలో తన ఉద్దేశం ఏంటి? ఇలా ఇవ్వన్నీ పరిగణలోకి తీసుకుని అప్పుడు ఎవరిని, దేనిని, ఎప్పుడు ఎలా అనుసరించాలో నిర్ణయించుకోండి!


మీరనచ్చు.. ఇప్పుడంత సమయం ఉందా? అని. మనకున్న సమయస్ఫూర్తిని సరిగ్గా వాడితే, తక్కువ సమయంలోనే నిజాల్ని గ్రహించచ్చు. అలా ఏది నిజం, ఏది వ్యాపారం ఇలా తెలుసుకున్న తరువాత అప్పుడు మీ మనసేం చెబుతుందో అది చేయండి. అలాగే, వీలైనంత వరకూ ఆరోగ్యకరమైన తిండి తింటూ, కాస్త ఆరోగ్యాన్ని పెంపొందించే అలవాట్లు అలవర్చుకుని, మన జాగ్రత్తలో మనం ఉన్నంతవరకూ చాలా వరకూ అవి మన దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవచ్చు. కానీ, ఒకోసారి మన చుట్టూ ఉన్నవాళ్ళ తప్పిదం వల్ల కూడా మనం అస్వస్థకు గురి కావచ్చు. అలా అని, భయపడకుండా.. వచ్చింది, సరే.. ఎలా నివారించుకోవాలి అనే దాని మీద దృష్టి పెట్టండి.


నాకేదో అయిపోతుంది అనే భయమే మనల్ని సగం కృంగతీస్తుంది, మనిషిని సగం చంపేస్తుంది... అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను.. భయం వద్దు, భయం వద్దు, భయం వద్దు...! అలాంటి క్షణాల్లో కూడా మనం ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండగలిగితే మనలో ఉన్న ఆ రోగాన్ని అక్కడే సగం జయించినవారవుతాం. నిజం.. శాస్త్రీయంగా కూడా ఏం చెబుతారంటే.. ముందు మనసు ఆరోగ్యంగా ఉంటే, అంటే మానసిక ఆరోగ్యం బావుంటే, అదే మనకొచ్చిన రోగాన్ని నయం చేయడానికి 60 నుండి 70 శాతం తోడ్పడుతుంది! మిగతా 40 నుండి 30 శాతమే ఈ చికిత్స, మందులు ఇవన్నీ...


చెబుతుంటారుగా.. ఎవరైనా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు.. "ఆయన చికిత్సకు అసలు స్పందించడం లేదు!" అని. అంటే అర్ధం... ఆ వ్యక్తి మానసికంగా బలహీన పడిపోయాడు, తాను ముందుగానే తీర్మానించేసుకున్నాడు ఇక తన వల్ల కాదని. అలాంటప్పుడే మనం అలాంటి మాటలు వింటుంటాం. కాబట్టి ధైర్యం వీడద్దు!


రెండోది, నిర్లక్ష్యం! కందిపప్పుకి, మినపప్పుకి, వడియాలకి, బొంబాయి రవ్వకి ఇలా అయిన దానికి, కాని దానికి బయట తిరగద్దు. నిజంగా అవసరముంటే, వచ్చి, కావాల్సింది తీసుకుని, క్షేమంగా ఇంటికి చేరండి. ఉత్తప్పుడు ఇంట్లో వాళ్ళతో గడపడానికి సమయం ఉండట్లేదు అంటున్నారు కదా... ఇప్పుడు గడపమంటే ఊరికే గడప దాటతారే? చెప్పుకోవాలే గాని, మన ప్రియమైన వాళ్లకి చెప్పేందుకు ఊసులెన్నో ఉంటాయి. ఎప్పటినుండో చెప్పాలనుకున్నవి కావచ్చు, భయం వల్లో మొహమాటం వల్లో చెప్పకుండా దాచిపెట్టినవి కావచ్చు.. ఇవ్వన్నీ బయటకి తీయండి, మీరు లోపలే ఉండి వాళ్ళతో అన్నీ పంచుకోండి!


ఇక వైద్య, రాజకీయ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ప్రజల బలహీనతల మీద వ్యాపారం చేయద్దు.


నేను ఏ వ్యకికీ వ్యతిరేకం కాదు.. వ్యక్తులు అవలంభించే విధానాలకు, నడిపించే వ్యవస్థలకు మాత్రమే వ్యతిరేకం!

మనిషిని మనిషిగా గుర్తించి, ఇలాంటి ఓ విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు ఒకరికొకరు అండగా నిలబడటమే మానవత్వం. మీరేదీ ఉచితంగా చేయక్కర్లేదు. కానీ, ఎవరి పరిస్థితీ.. అంటే ఆర్థిక, మానసిక, శారీరక పరిస్థితులు ఇంచుమించు ఎవరివీ బాలేదు కాబట్టి... ఇలాంటి సమయంలో కాస్త అందరికీ అందుబాటులో ఉండే విధంగా, సముచితమైన ధరలను నిర్ణయిస్తే, అంటే అది ఒక పెట్రోల్ ధరే కావచ్చు, వంట నూనె ధరే కావచ్చు, మందులు, చికిత్సకు అయ్యే ఖర్చే కావచ్చు.. ఇవన్నీ వీలైనంత సముచితమైన, సానుకూలమైన ధరలతో అందిస్తే, పరిస్థితిలో ఉన్న ఈ ప్రతికూలత చాలా వరకూ తొలగిపోయి, ప్రతిఒక్కరూ కాస్త ఊపిరి పీల్చుకుంటారు.


కాబట్టి, ప్రతీది వ్యాపార దృష్టితోనే కాకుండా, మానవతా దృష్టితో చూసి, నేను సైతం అంటూ మీ వంతు మన ఈ ఉమ్మడి కుటుంబానికి అండగా నిలబడాలి అని, నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుచేస్తూ, మనకొచ్చిన ఈ కష్టాన్ని అంతా కలిసి అధిగమించాలని, ఎక్కువ నష్టం కలగకుండా ఈ విప్పత్తు నుండి బయటపడాలని విజ్ఞప్తి చేస్తున్నాను!


దయచేసి, ఎవరూ కూడా దీన్ని అన్యదా భావించకుండా.. ఇందులోని వాస్తవాల్ని మాత్రం గ్రహించి, మీకున్న విజ్ఞతతో, విచక్షణతో సరైన నిర్ణయం తీసుకుని, మీతోపాటు మీ చుట్టూ ఉన్నవాళ్ళని ముందుకి నడిపిస్తారని ఆశిస్తూ... మీ హేమంత్! జై హింద్! సర్వేజనా సుఖినోభవంతు!


చెప్పినదాంట్లో అర్థం ఉండి, ఇది నలుగురికీ పనికొస్తుందని అని మీకనిపిస్తే, దీన్ని షేర్ చేయండి! లేదా లేదు..

23 views0 comments

Comentários


bottom of page